నేటి సాక్షి. కొమరం భీం ఆసిఫాబాద్ *జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు 862 మంది పోలీస్ శాఖ, ఇతర శాఖల సమన్వయం తో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు – జిల్లా ఎస్పీ నితిక పంత్* జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాత్ర కీలకమైందని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. రెండో విడత ఎన్నికలలో భాగంగా ఈ నెల 14 న బెజ్జూర్, చింతలమానేపల్లి, దహేగాం, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్ టి మండలాల పరిధిలో 113 సర్పంచ్ స్థానాలు, 992 వార్డు మెంబర్ స్థానాలకు నిర్వహించే ఎన్నికలకు పోలీస్ బందోబస్త్ సంసిద్దమని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ తెలిపారు.అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సైలెంట్ పీరియడ్ అమలుపోలింగ్‌కు 48 గంటల ముందు నుండి, అనగా 12-12-2025 సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు, సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్‌స్పీకర్ వినియోగం, ర్యాలీలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధం అని అన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పహార, నిఘా బృందాలు, ఏరియా డామినేషన్ పార్టీలు, రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ తో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండో విడత ఎన్నికల కోసం 665 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 197 మంది ఇతర శాఖల సిబ్బంది( ఫారెస్ట్, సింగరేణి, ఎక్సైజ్, ట్రాన్స్ కో, ఎ.సి.బి శాఖలు ) మొత్తం 862 మందిని నియమించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికలు పూర్తయ్య వరకు జిల్లాలో 163 BNSS (144 సెక్షన్ ) అమల్లో ఉంటుందని, ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా ఆ పైగా వ్యకులు గుంపులు గుమికూడరాదు. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు అక్కడ సమూహాలుగా ఉండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి మద్యం దుకాణాలు మూసి ఉంచాలని అన్నారు.పోలింగ్‌కు 48 గంటల ముందు నుండి ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. ఎన్నికల ఫలితాలు అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు, బైక్ ర్యాలీలకు, అనుమతి లేదని, మూడో విడత ఎన్నికలు పూర్తయిన అనంతరం సంబంధిత అధికారులు నిర్దేశించిన తేదీలలో మాత్రమే విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ నితికా పంత్ గారు కోరారు.





