Thursday, March 19, 2026

*విద్యార్థి లేనిదే ఏ ఉద్యమం లేదు..* *స్వాతంత్య్రోద్యమంలోనూ వారిదే కీలకపాత్ర..**ఉన్నత విద్యలో సమూల మార్పుకు నడుం బిగించాలి**ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభల్లో సంఘీభావ వక్తలు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) ‘విద్యార్థి లేనిదే ఏ ఉద్యమం లేదని చరిత్ర చెబుతోంది..నాడు స్వాత్రంత్యోద్యమంలోనూ విద్యార్థులకు కీలక భూమిక పోషించారు.. నేడు కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణతో కూడిన నూతన విద్యను సమూలంగా మార్చాలంటూ బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలి’ అని వక్తలు పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో శనివారం రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా ఈ మహాసభలకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రసంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. పిడిఎఫ్‌ మాజీ ఎంఎల్‌సి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ‘నేను ఎస్‌ఎఫ్‌ఐ నుంచే నాయకత్వ లక్షణాలను అలవరచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో పోటీచేసి జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యాను. తరువాత 25 ఏళ్లపాటు లెక్చరర్‌గా పనిచేశాను. 14 ఏళ్లపాటు పిడిఎఫ్‌ ఎంఎల్‌సిగా ఉన్నాను. ఇంత స్థాయికి రావడానికి కారణం ఎస్‌ఎఫ్‌ఐ క్రమశిక్షణ, ఉద్యమం నేర్పిన పాఠాలు. సమాజంలో పేదల కోసం విద్యార్థులు పని చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యను వ్యాపారమయంగా మార్చేశారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ అధ్యయనం చేసి పోరాటాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. వారికోసం వర్కుషాపులు, శిక్షణా తరగతులు, టెక్నాలజీతో కూడిన శిక్షణ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేయాలి. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 77 రద్దు చేస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్‌ విస్మరించారన్నారు. జగన్‌ హయాంలో ఆరు పాఠశాలలను చేస్తే, నారా లోకేష్‌ ఆధ్వర్యంలో తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించి 25వేల స్కూళ్లు మూతబడేలా చేశారన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది ప్రజలు చదువుతుంటే 34లక్షల మంది పిల్లలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో చదువుతున్నారన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఊరికి వెళ్లేటప్పుడు ఇంటికి ఏ విధంగా తాళం వేసుకుని వెళతామో స్కూలుకు వెళ్లే విద్యార్థులు కులం, మతాలన్నింటినీ ఇంటి గడల లోపలే వదిలేసి వెళ్లాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరికీ చదువు అనేది నేటి పాలకులు విస్మరిస్తున్నారన్నారు. నాణ్యమైన, ఉన్నత విద్య అభివృద్ధికి ఎస్‌ఎఫ్‌ఐ చేసే పోరాటంలో యుటిఎఫ్‌ క్రియాశీలకంగా భాగస్వామ్యం అవుతుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం లేనిదే ఏ ఉద్యమమూ లేదన్నారు. సామ్రాజ్యవాద అమెరికాలో కీలకనగరమైన న్యూయార్క్‌లో సోషలిస్ట్‌ పవనాలు వీస్తున్నాయన్నారు. సామాజ్య్రవాదం బీటలు వారుతుందనడానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 40శాతం మంది వ్యవసాయ కూలీల పిల్లలేనని అన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల్లో చదివించడమే ఎక్కువైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న నూతన విద్యా విధానం వల్ల డ్రౌపౌట్స్‌ పెరిగే ప్రమాదం ఉందన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, కార్మిక సంఘాలు కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. విద్యను వ్యాపారీకరణ చేసేశారు. ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను అదానీ, అంబానీలకు ప్రధాని మోడీ దోచి పెడుతున్నారన్నారు. దేశంలో లేబర్‌కోడ్‌లను తెచ్చి కార్మిక శక్తిని బలహీనపరిచేందుకు మోడీ సర్కార్‌ కుట్ర పన్నుతుందన్నారు. దేశం క్లిష్టపరిస్థితులు ఉన్న నేపథ్యంలో బలమైన ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మోడీ కనుసన్నల్లో పాలన చేస్తున్నారు తప్ప స్వయం పాలన లేదన్నారు. కేరళలో కేంద్రం సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ పేదరికాన్ని జయించిందన్నారు. సామ్రాజ్యవాదానికి సవాల్‌ విసురుతూ చైనా, క్యూబాలు ధీటైన ప్రత్యామ్నాయాలతో ముందుకు పోతున్నాయన్నారు. పాండిచ్చేరి యూనివర్సివటీలో ఇటీవల ఎన్నికైన యూనియన్‌ ఉపాధ్యక్షురాలు శ్రేష్ట ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమ ఫలితాలను వివరించారు. అఖిలభారత అధ్యక్షులు ఆదర్శ్‌ ఎం.సాజి, కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.రామ్మోహన్‌, కె.ప్రసన్నకుమార్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్‌, భగత్‌రవి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News