నేటి సాక్షి,బాపట్ల జిల్లా (అద్దంకి)విద్యార్థులు కష్టపడి చదివితేనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. SRR ప్రాజెక్ట్స్, అసిస్ట్ సంస్థ సహకారంతో రావినూతల ఉన్నత పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఒక్కో టీచర్ రెండు, మూడు సబ్జెక్ట్ లను బోధించేవారన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఒకేసారి 16,300 ఉపాధ్యాయులను డిఎస్సీ ద్వారా నియమించామని చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం మరింత పెరిగే విధంగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనంతో పాటు సమయానికి యూనిఫార్మ్లు, బుక్స్, బ్యాగులను కూడా అందించామని మంత్రి గుర్తు చేశారు. అదే విధంగా రావినూతల, చందలూరు ప్రాంతాల్లో వచ్చే ఏడాదికి జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.





