నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 16 ~అన్నమయ్య జిల్లా :-: రైతు సేవ కేంద్రాలలో ఉచిత వేరుశెనగ పంపిణీలో అవినీతిపై జిల్లా కలెక్టర్‌కు మాల మహా నాడు ఫిర్యాదు చేసింది. పీలేరు మండలంలోని రైతు సేవ కేంద్రాలలో ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ రైతులకు ఉచితంగా అందించాల్సిన వేరుశెనగ పంపిణీలో తీవ్ర అవినీతి చోటుచేసుకున్నట్లు మాలమహానాడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం మరియు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఆధారంగా ఎస్సీ /ఎస్టీ రైతులకు ఉచితంగా వేరుశెనగ పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ, పీలేరు మండలంలోని అనేక గ్రామాలలో అర్హులైన ఎస్సీ /ఎస్టీ రైతులకు వేరుశెనగ అందలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామాల్లో నామ మాత్రపు పంపిణీ మాత్రమే నిర్వహించి, కొంతమంది అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తూ స్థానిక కూటమి నాయకులతో కుమ్మక్కై అనర్హులకు పెద్ద మొత్తంలో వేరుశెనగను పంపిణీ చేసి, నిజమైన అర్హులైన ఎస్సీ/ఎస్టీ రైతులను విస్మరించినట్లు ఆరోపించారు. వేరుశెనగ సాగు చేస్తున్న ఎస్సీ/ఎస్టీ రైతులకే పంపిణీ చేస్తున్నామని చెప్పి, వాస్తవానికి అనర్హులకు ఇచ్చి అర్హులకు ఇవ్వలేదని వివరించారు. ఈ విషయమై గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగకపోవడంతో మంగళవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి మరో సారి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పీలేరు మండలానికి ఇప్పటి వరకు ఎంత వేరుశెనగ వచ్చిందో, ఎంతమంది ఎస్సీ/ఎస్టీ రైతులకు పంపిణీ జరిగిందో రైతు సేవ కేంద్రాల వారీగా గుర్తించి, వేరుశెనగ పంపిణీలో అవినీతికి పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు సోదరులు కలెక్టర్ ను కోరారు..~~~~~~~~~~~~~~~~~~





