నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి పార్లమెంట్ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల వద్ద వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యల గూర్చి తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో ప్రస్తావించారు. చిన్నపాటి వర్షాలకే కొన్ని అండర్ బ్రిడ్జ్‌ల వద్ద నీరు నిలవడంతో ప్రయాణికులకు అసౌకర్యంగా మారడం తోపాటు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లారు.ఈ ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ సమాదనం ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు, సబ్వేలలో నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ వ్యవస్థలు, నీటి మళ్లింపు మార్గాలు, క్రాస్ డ్రైన్లు, జాయింట్ సీలింగ్, ఎంట్రీ వద్ద హంప్‌లు, కవర్ల షెడ్లు, అత్యవసర పంపింగ్ ఏర్పాట్లు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అసాధారణ వర్షపాతం సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం, హెచ్చరిక బోర్డులు, గేటు బారియర్లు, వాచ్మన్ల నియామకం వంటి భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి, మొత్తం 43 రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు ఉన్నాయని, గత వర్షాకాలంలో గూడూరు, రేణిగుంట సెక్షన్ లో చెర్లోపల్లి, కాపుగున్నేరి, రాచగున్నేరి లోని మూడు అండర్ బ్రిడ్జ్‌ల వద్ద నీరు నిలిచి సమస్య వచ్చిందని, దానిని పంపింగ్ ద్వారా పరిష్కరించినట్లు సమాధానంలో పేర్కొన్నారు. అలాగే తిరుపతి నియోజకవర్గంలో రూ.208 కోట్ల వ్యయంతో 6 చోట్ల రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జ్‌లు నిర్మించేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలియజేశారు. మొత్తంగా సమస్య ఉందని ప్రభుత్వం గుర్తించిందని, తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాల దిశగా పనులు జరుగుతున్నాయని మంత్రి తన సమాదనంలో తెలియజేశారు. అయితే డిజైన్ లోపాలపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. స్థానిక మున్సిపల్ సంస్థలతో సమన్వయంతో సమగ్ర డ్రైనేజ్ పరిష్కారాలపై పని చేస్తున్నామని మాత్రమే తెలిపారు. ఈ అంశంపై ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ రైల్వే అండర్ బ్రిడ్జ్‌లలో వర్షాకాలం నీరు నిలవడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం పడినా కూడా కొన్ని అండర్ బ్రిడ్జ్‌లు నీటితో నిండిపోవడం చూస్తుంటే స్పష్టమైన డిజైన్ లోపాలు, సమగ్ర డ్రైనేజ్ ప్రణాళిక లేకపోవడాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాత్కాలిక పంపింగ్ ఏర్పాట్లకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్‌లలో సరైన డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న అండర్ బ్రిడ్జ్‌లలో డిజైన్ ఆడిట్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు.





