నేటిసాక్షి, కరీంనగర్:పెండిరగులో ఉన్న బిల్లులను చెల్లిస్తేనే డిసెంబర్ 18 నుంచి లెప్రసీ సర్వేను చేస్తామని ఆశా వర్కర్లు గురువారం డీఎంహెచ్‌ఓ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత మాట్లాడుతూ లెప్రసీ సర్వే చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని, కానీ, సర్వే చేస్తే అదనంగా డబ్బులు చెల్లిస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. ప్రజలకు సేవలందించడానికి ఆశా వర్కర్లు నిరంతరం సిద్ధంగా ఉన్నారని, ఏటా లెప్రసీ సర్వే విషయంలో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని గతేడాది లెప్రసీ సర్వేకు అదనపు డబ్బులు చెల్లింపు కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. పోరాట ఫలితంగా సర్వేకు అదనంగా డబ్బులు చెల్లిస్తామని, అంతకుముందు పెండిరగులో ఉన్న బిల్లులనూ వెంటనే చెల్లిస్తామని రాష్ట్ర అధికారులు గతంలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంశాలకు భిన్నంగా మళ్ళీ సమస్యలను సృష్టించడం, ఆశాలను గందరగోళం చేయడం సమంజసం కాదని తెలిపారు. నేటికీ ఆశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చెల్లించటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించలేదని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి చాలీచాలని పారితోషికాలతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఆశాలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాల్సిన ప్రభుత్వం, అదనపు సర్వే బిల్లులను ఎగ్గొట్టాలని చూడడం దారుణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యూటీలు చేసిన ఆశాలకు అత్యధిక జిల్లాల్లో డబ్బులు ఇంకా చెల్లించలేదని, డిసెంబర్ 18 నుండి ప్రారంభమయ్యే లెప్రసి సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని కోరారు. గతంలో జిల్లాల్లో పెండిరగులో ఉన్న 2022, 2023 సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు, పల్స్‌పోలియో బిల్లులు వెంటనే చెల్లించాలని, పెండిరగ్ బిల్లులు వచ్చేవరకు సర్వే చేయటం కుదరదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాల్వ సారిక, ఉపాధ్యక్షురాలు నాగెల్లి పద్మ, సత్యలక్ష్మీ సహాయ కార్యదర్శి సరిత, సుమలత, నాయకులు ప్రియంక, సదాలక్ష్మి. లక్ష్మీ., రమాదేవి, శ్రీలత, ప్రమీల, సుమలత పాల్గొన్నారు.

