నేటిసాక్షి, కరీంనగర్:ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై పెట్టిన తప్పుడు కేసులను, ఉపాధి హామీ పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. టీపీసీసీ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయాల ముట్టడికి బయల్దేరనున్న డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పలువురు నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్తున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు పీటీసీకి తరలించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టులు కాంగ్రెస్ అగ్రనేతల ప్రమేయం లేదని తీర్పు ఇచ్చిందని, అయినా కేంద్రంలోని మోదీ సర్కారు ఈడీ, సీబీఐలను జేబు సంస్థల్లా వాడుకుంటోందని విమర్శించారు. రాజకీయంగా అణగదొక్కాలని ప్రతీకార చర్యలకు పాల్పడుతూ, మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ నాయకులను ప్రజాక్షేత్రంలో తిరగనివ్వబోమని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.బీజేపీది నిరంకుశ పాలనకార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ‘వైద్యుల’ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను భయాందోళనకు గురిచేసి నోరు నొక్కాలని చేస్తున్న కుట్రలను ఇక సహించమని పేర్కొన్నారు. అక్రమ కేసులను కోర్టులు కొట్టివేసిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీ తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. నేషనల్ హెరాల్డ్ స్వాతంత్య్ర సమరయోధులు ఏర్పాటుచేసిన పత్రిక అని, ఈ పత్రిక నడవలేని పరిస్థితుల్లో సిబ్బందికి జీతాలివ్వడానికి కాంగ్రెస్ కార్యకర్తలు రూపాయి, రూపాయి జమచేసినట్లు గుర్తుచేశారు. కానీ, మోదీ సర్కారు మనీలాండరింగ్ ఆరోపణల పేరిట ఈడీతో దాడులు చేయించిందని, కోర్టు వీరికి క్లీన్చిట్ ఇవ్వడంతో తెల్లమొహాలు వేసుకున్నారని విమర్శించారు.కక్ష సాధింపుతోనే వేధింపులుసుడా చైర్మన్ ‘కోమటిరెడ్డి’కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలపై నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరిట వేధింపుల పర్వం కొనసాగించారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ఎలాంటి ఆధారాల్లేకున్నా విచారణల పేరిట గంటలకు గంటలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టిన తమను అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మల్లికార్జున రాజేందర్, కర్ర రాజశేఖర్, పడిశెట్టి భూమయ్య, గంట కళ్యాణి, కోడూరి రవీందర్‌గౌడ్, సిరాజ్‌హుస్సేన్, బానోతు శ్రవణ్‌నాయక్, అరుణ్‌కుమార్, బోనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





