నేటిసాక్షి, కరీంనగర్:కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ (ఎస్పీఈ యాక్ట్ 1976)ను పునరుద్ధరించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ 4 కొత్త కార్మిక చట్టాలతో దేశంలోని కార్మికవర్గానికి, మెడికల్, సేల్స్ రిప్స్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. యూనియన్ ఏర్పాటుచేసుకొనే హక్కును, న్యాయమైన సమస్యల పరిష్కారానికి సమ్మె చేసే హక్కును కాలరాసేలా ఈ చట్టాలున్నాయని తెలిపారు. మెడికల్, సేల్స్ రిప్స్ కోసమే ఏర్పాటుచేసిన ఎస్పీఈ యాక్టు 1976 కూడా రద్దు చేయడంతో అపాయింట్మెంట్ లెటర్ రాకపోవడం, కనీస వేతన చట్టం, గ్రాట్యుటీ చట్టం లాంటి ఎన్నో చట్టాల అమలు ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. పాత చట్టం ప్రకారం అమలవుతున్న సెలవులు తగ్గిపోతాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఈ యాక్టు 1976ను యథావిధిగా అమలుచేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ చట్టాలు తయారుచేసే సమయంలో యూనియన్‌గా తామిచ్చిన సలహాలు, సూచనలు పొందుపరచాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ మెడికల్, సేల్స్ రిప్స్ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ ధర్నాలో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు జీ. విద్యాసాగర్, ఎ. సదానందచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. అంజయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్, టీఎంఎస్‌ఆర్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. వెంకటేశ్వర్లు, పీ. హరీష్, ఉపాధ్యక్షులు బాలకిషన్, సహాయ కార్యదర్శులు పి. నరేందర్, కె. మదన్మోహనాచారి, కోశాధికారి కె.సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





