..నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- నెల్లూరుకు చెందిన ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు, ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవా రంగానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ నెల్లూరులో తుది శ్వాస విడిచారు. ఇకపోతే హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఒక ప్రముఖ ఇస్లామియ పండితుడు. ఇంకా ఇస్లామియా న్యాయ నిపుణుడు (ఫకీహ్) కూడా. 60 ఏళ్లకు పైగా ఇస్లామియ విద్య, ఖుర్‌ఆన్–హదీస్ బోధనతో గడిపిన ఆయన స్థానిక జామియా నూరుల్ హుదా మదర్సాలో సేవలందించారు. 50 ఏళ్లుగా రాష్ట్ర తబ్లిక్ – ఏ – జమాత్ అధ్యక్షుడిగా ఉన్న మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్, 2008 నుంచి రాష్ట్ర జమియత్ – ఉలామాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. నెల్లూరులో 50 ఏళ్ల క్రితం మదర్సా జామియా నూరుల్ హుదా అరబిక్ కాలేజీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆయన, అప్పటి నుంచి దాని వ్యవస్థాపక అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. జీవితమంతా ఇస్లాం మత ప్రబోధకుడిగా పని చేసిన మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ నెల్లూరు జిల్లాలోనే తొలి ముఫ్తీగా గుర్తింపు పొందారని ఆయన మరణం అక్కడ ఇస్లాం మతానికి, వేలాది విద్యార్థులకు తీరని లోటని వైయస్ జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు..~~~~~~~~~~~~~~~~~

