నేటి సాక్షి వికారాబాద్:గాలిపటాలు ఎగురావేయడానికి చైనిస్ మాంజా ను ఉపయోగించవద్దు అని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, తెలిపారు. చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయించడం, నిల్వ చేయడం, వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందని, పర్యావరణానికి, పక్షులకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ దారం గాలిపటాలు ఎగురవేసే సమయంలో మెడకు లేదా శరీర భాగాలకు తగిలితే తీవ్రమైన గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని, గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయని ఎస్పీ గుర్తు చేశారు.జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు, గాలిపటాల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎక్కడైనా నిషేధిత చైనీస్ మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆమె వ్యాపారులకు సూచించారు. పర్యావరణ హితమైన, సురక్షితమైన నూలు (కాటన్) దారాలను మాత్రమే విక్రయించాలని కొనుగోలు చేయాలని ఎస్పీ కోరారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ఇట్టి విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ 100 కు సమాచారం అందించాలని ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు.

