నేటి సాక్షి, కొమురం భీమ్ ఆసిఫాబాద్:జిల్లాలో డిసెంబర్ 31 రాత్రి మరియు నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, చట్ట నిబంధనలకు లోబడి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.డిసెంబర్ 31 సాయంత్రం నుంచే జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ్ వంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.మైనర్లు వాహనాలు నడిపితే, వారిపై మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతులు లేవని, అనుమతులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, ప్రోగ్రాములు నిర్వహించరాదని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని గుర్తు చేశారు.రోడ్లపై కేక్ కటింగ్‌లు చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్‌లు చేయడం చట్ట ప్రకారం నేరమని పేర్కొంటూ, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు.ఇళ్లలో సౌండ్ బాక్సులు, మైక్ సిస్టంలతో వేడుకలు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని సూచించారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు పంపించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.– జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్

