Wednesday, January 21, 2026

జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.నూతన సంవత్సర వేడుకల్లో డీజే (DJ)లకు అనుమతి లేదు.జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, వాహన తనిఖీలు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా.

నేటి సాక్షి వికారాబాద్ :నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్రా, తెలిపారు. పోలీస్ నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల యజమానులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన సమయ పాలనను ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో జిల్లాలో ఎక్కడా డీజే (డీజే) సిస్టమ్‌లకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు.మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్పీ ప్రజలను హెచ్చరించారు. వేడుకల పేరుతో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ మద్యం సరఫరా లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మైనర్లకు మద్యం సరఫరా చేస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.అతి ఉత్సాహంతో అర్థరాత్రి వేళ ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్లడం, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా ఈవ్ టీజింగ్‌కు పాల్పడటం వంటి పనులు చేయవద్దని యువతను ఎస్పీ కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధించబడింది.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్హెచ్‌ఓ (SHO)లు ప్రత్యేక బృందాలతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు,విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. వేడుకల ముసుగులో ఎక్కడైనా ఈవ్ టీజింగ్ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, వీటిని షీ టీమ్ (శి టీం) అధికారులు నిశితంగా గమనిస్తారని పేర్కొన్నారు.అదనంగా, వేడుకలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించారు. వికారాబాద్ జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి, నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె పేర్కొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News