నేటిసాక్షి : జగదేవపూర్ డిసెంబర్ 31 మహిళా సంఘాల్లో వివో ఏ లుగా పనిచేసి ప్రస్తుతం సర్పంచులుగా ఎన్నికవ్వడం చాలా అభినందనీయమని గ్రామ అభివృద్ధి సాధించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఏపీఎం నరసయ్య పేర్కొన్నారు. మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో వివో ఏ గా పనిచేసిన కనకయ్య ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికవ్వడం అభినందనీయమన్నారు. అలాగే తిగుల్ గ్రామంలో వివో ఏగా పని చేసిన రజిత స్థానిక సంస్థలు ఎన్నికలో గ్రామ సర్పంచిగా గెలుపొందడం అభినందనీయమన్నారు. బుధవారం ఐకెపి కార్యాలయంలో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. సభలో సర్పంచులైన కనకయ్య, రజితలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలుగడ్డ గ్రామ సర్పంచ్ కనకయ్య చాలా ఏళ్ల నుంచి గ్రామ వి ఓ ఏ గా పనిచేసి మంచి పేరు సాధించారని తెలిపారు. ఆ గ్రామస్తులు కనకయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, గ్రామానికి ఆయన చేసిన సేవలే కారణమన్నారు. ఐదేళ్లపాటు సర్పంచిగా మంచి సేవా కార్యక్రమాలతో పాటు గ్రామ అభివృద్ధి సాధించి మంచి పేరు పొందాలని ఆకాంక్షించారు. అలాగే తిగుల్ గ్రామ సర్పంచి రజిత మూడేళ్లకు పైగా పనిచేసి మంచి పేరు సాధించారని తెలిపారు. మహిళకు అవకాశం రావడంతో సర్పంచిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టి మహిళ సాధికారత సాధించాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో సీసీలు సుమలత, పుష్పలత, అనురాధ, లింగం, బాలకృష్ణ, రవి, నాగరాజు, ఆయా గ్రామాల వి ఓ ఏ లు పాల్గొన్నారు.

