నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.భీమేశ్వర ఆలయంలో స్వామివారిని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే దర్శించుకునేందుకు గురువారం వెళ్లగా, ఆలయ అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాభాయ్ ని అర్చకులు స్వామి వారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం అందజేశారు.*ఏర్పాట్ల పరిశీలన*సమ్మక్క సారలమ్మ జాతర, మహా శివరాత్రి నేపథ్యంలో ఆలయంలో తాగు నీటి సరఫరా, ప్రసాదం కౌంటర్ వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ ఏరియా, టాయిలెట్లు, షవర్ స్నానాల ఏర్పాట్లను, కోడె మొక్కుల టికెట్ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు, నీటి సరఫరాకు ఏర్పాట్లను కాలినడకన తిరుగుతూ ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద నూతన భవనం స్లాబ్ పనులు పూర్తి చేసి, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. భీమేశ్వర, బద్ది పోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.పరిశీలనలో ఆర్అండ్ బీ ఈఈ నరసింహాచారి, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.

