నేటి సాక్షి, ఎండపల్లి:* మండలం లోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన దీర్ఘ కాలికంగా తిష్టవేసిన అనేక సమస్యలపై ప్రత్యేక దృష్టితో ప్రణాళిక బద్ధంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు ముందుకు సాగుతున్నారు. గుల్లకోట గ్రామంలో సర్పంచ్ గొల్లపల్లి మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో చికెన్ సెంటర్ల, ఫిష్ సెంటర్ల, హోటల్ నిర్వాహకులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ, కుక్కల బెడద నివారించేందుకు.. చెత్త, వ్యర్ధాలు ఇష్టారీతిన పడేయకుండా డబ్బాలో నిల్వ చేయాలని దీనిని సేకరించేందుకు ప్రతిరోజు సాయంత్రం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు సహకరించాలని సూచించారు. సమావేశంలో నిర్ణయించినట్టుగానే సాయంత్రం ఐదు గంటలకు పోగుచేసిన వ్యర్ధాలను ట్రాక్టర్ లో డంపింగ్ యార్డ్ కు తరలించారు. కొత్తపేట సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్- రాయపట్నం రహదారికి ఇరువైపులా దట్టంగా వ్యాపించిన పిచ్చి మొక్కలను ప్రయాణికుల ఇబ్బంది దృష్ట్యా చదును చేశారు. అదేవిధంగా వైన్స్ ఎదురుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు డి 83 కెనాల్ లింక్ నీటి పంపిణీ పైపు లైన్ వద్ద పక్క గోడలు కూలిపోవడంతో ప్రదేశం ఇరుకుగా మారింది. దీనిపై నీటి పారుదల శాఖ ఏ.ఈ మహ్మద్ అసీరుద్దీన్ కు వివరించగా ఆయన గ్రామంలో సందర్శించి పనిని అంచనా వేసి పరిష్కారం దిశగా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంకు నూతన సర్పంచులు ఉత్సాహంతో చొరవ చూపుతున్న తీరుపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంల్లో పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

