*నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):*ఒడ ఎక్కేదాకా ఒడ మల్లన్న ఒడేక్కాక బోడి మల్లన్న అన్న చందంగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తీరు ఉందని, సాధారణ ఎన్నికలప్పుడు లబ్ధిపొందేందుకు డబుల్ రోడ్డు పేరుతో రాజకీయం చేసి ప్రజల ఓట్లతో గద్దెనెక్కి.తీరా డబుల్ రోడ్డును రెండు సంవత్సరాలు అయినా పూర్తి చేయకుండా చేతులెత్తేసిన ఘనత కవ్వంపల్లికే దక్కుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంద రోజుల్లో గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు రెండు వరుసల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ప్రజలను నిండా ముంచి అవస్థల పాలు చేసింది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకర తేలిన రోడ్డుతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, గునుకుల కొండాపూర్ వద్ద ప్రమాదకరంగా ప్రమాదం పొంచి ఉన్నా ఇప్పటికీ శాశ్వత చర్యలు తీసుకోలేదని అన్నారు. డబుల్ రోడ్డు పేరుతో యువజన సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్ష నాయకులు గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై ధర్నా చేస్తామన్న హెచ్చరికతో ఉలిక్కిపడిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 15 రోజుల్లో రోడ్డు పనులను ప్రారంభిస్తామని వీడియో సందేశం విడుదల చేశారని, ఇప్పటికీ రెండు నెలలు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, రోడ్డు పనులను ప్రారంభించడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్టోబర్ నెల నాటికి డబుల్ రోడ్డు పనులను పూర్తి చేస్తామన్న ప్రకటన హాస్యాస్పదంగా ఉందని, ఎమ్మెల్యే కవ్వంపల్లి నిర్లక్ష్య వైఖరితో రోడ్డు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రభుత్వం, సంబంధిత మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించి పనులను వెంటనే ప్రారంభించాలని లేనిపక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

