నేటిసాక్షి, కరీంనగర్: నగరపాలిక, పురపాలిక ముసాయిదా ఓటర్ల జాబితాను సవరించాలని ఏఐఎఫ్‌బీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి తేజ్‌దీప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మంగళవారం అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేకు వినతిపత్రం అందించారు. జాబితాలో దొంగ ఓట్లు, చనిపోయిన వారిని గుర్తించి తొలగించాలని, అలాగే ఒకేఇంటిపై నమోదైన 10 నుంచి 30 వరకు ఓట్లను సమగ్రంగా పరిశీలించాలని వారు కోరారు. జాబితా అభ్యంతరాలపై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ ముసాయిదా ఓటరు జాబితాలు తప్పులతడకలుగా ఉన్నాయన్నారు. చాలాచోట్ల రెండుసార్లు పేర్లు రావడం, దొంగ ఓట్లు, చనిపోయిన వారిని తొలగించలేదన్నారు. ఈ విధంగా ముందుకు వెళ్తే రిజర్వేషన్లలో ప్రభావం చూపుతుందని, ఒక డివిజన్‌లోని ఓటర్లు వేరే డివిజన్లలో వచ్చారని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు డివిజన్లలో వచ్చారని తెలిపారు. ముఖ్యంగా బొమ్మకల్‌లోని మెడికల్ కాలేజి, రేకుర్తి లయోలా స్కూల్, కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, కరీంనగర్ రూరల్, ప్రైవేటు హాస్టళ్లలో ఎక్కువగా దొంగ ఓట్లు నమోదవడానికి అవకాశముందన్నారు.

