నేటి సాక్షి ,బాపట్ల జిల్లా ప్రతినిధి బాపట్ల పట్టణంలో ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం బ్రిడ్జి వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తున్న నేపథ్యంలో, నాణ్యమైన హెల్మెట్ వాడకం ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన నిబంధన మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రతకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల పట్టణ సీఐ ఆర్. రాంబాబు, మాట్లాడుతూ, హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, తమ కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పట్టణ సీఐ ఆర్. రాంబాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు తెలిపారు.

