నేటి సాక్షి వికారాబాద్:రాబోయే సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా ప్రజలు తమ స్వగ్రామాలకు, ఇతర పట్టణాలు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లకు తాళం వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా నిరంతర పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లు, గ్రామాలు, పట్టణాల్లో గస్తీ పెంచి, రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు తమ ఇళ్లకు సురక్షితంగా తాళాలు వేసుకోవాలని, విలువైన వస్తువులు, నగదు, బంగారం ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లలో భద్రపరచాలని సూచించారు. అలాగే పొరుగువారికి లేదా సమీప బంధువులకు సమాచారం ఇవ్వడం, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని తెలిపారు. దొంగతనాలను నివారించడానికి పోలీస్ అధికారుల నియమ , నిబందనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది.అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే శాంతియుతంగా, సురక్షితంగా పండుగలను జరుపుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.

