నేటి సాక్షి, జనవరి 09(ఎండపల్లి):* పక్కింట్లో ఏం జరిగినా మనకెందుకులే అని ఊరుకోకుండా నిరుపేద బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఓ యువకుడు స్పందించిన తీరు ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే వెల్గటూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో గత ఐదు రోజుల క్రితం నల్లూరి లక్ష్మి అనే మహిళా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతురాలి చికిత్సకు కూడబెట్టిన సొమ్మంతా కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబ పరిస్థితిని ఇంటి పక్కే ఉంటూ గమనించిన అల్లం అనిల్ కుమార్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి బాధిత కుటుంబానికి సహాయం అందించాలని కోరాడు. దీనిపై పలువురు మానవత్వంతో దాతలు స్పందించి తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించడంతో సుమారు రూ. 75,500 జమ కాగా శుక్రవారం అట్టి నగదు తో పాటు 50 కిలోల బియ్యంను బాధిత కుటుంబానికి అతడు అందించాడు. సామాజిక మాధ్యమాలను వినోదానికి, కాలక్షేపానికి, చెడు కార్యకలాపాలకు యువత వినియోగిస్తూ బానిసగా మారే ఈ రోజుల్లో వీటిని ఉపయోగించి మంచి, సహాయం చేయవచ్చునని నిరూపించాడు. గతంలో కూడా ఇదే తరహాలో సామాజిక స్పృహతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనిల్ కు ప్రజల్లో నుండి అభినందనలు వెల్లివిరుస్తున్నాయి.

