నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు స్వగ్రామాలకు, ఇతర పట్టణాలు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లకు తాళం వేసి వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ గారు ప్రజలను కోరారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా నిరంతర పోలీస్ పెట్రోలింగ్‌తో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.దీర్ఘకాలం పాటు ఇళ్లను మూసివేసి వెళ్లే వారు తమ ప్రయాణ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ముందుగా నమోదు చేయాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేయేటప్పుడు అన్ని తలుపులు, కిటికీలు బలంగా మూసి, భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువులు, నగదు మరియు బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని సూచించారు.అలాగే పొరుగువారికి లేదా సమీప బంధువులకు తమ ప్రయాణ వివరాలు తెలియజేయాలని, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.

