నేటిసాక్షి, కరీంనగర్:కాంగ్రెస్ నాయకుల సంబరాలు సామాన్య ప్రజానీకాన్ని అవస్థల పాల్జేసింది. కరీంనగర్‌లో అత్యంత రద్దీగా ఉండే కోర్టు చౌరస్తాలో నడిరోడ్డుపైనే బహిరంగ సభను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. భారీఎత్తున బారికేడ్లను ఏర్పాటుచేసి ఉదయం నుంచే అటువైపుగా వెళ్లే వాహనాలను నిలిపివేయడం సర్వత్రా చర్చకు దారితీసింది.టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారి కరీంనగర్‌కు వస్తున్న సందర్భంగా శనివారం కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో బహిరంగ సభ ఏర్పాటుచేశారు. దీనికోసం ఉదయం నుంచి ఎస్సారార్ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా మీదుగా బస్టాండుకు వెళ్లే రహదారిని మూసివేశారు. కోర్టు చౌరస్తా వద్ద బహిరంగ సభకు వేదికను సిద్ధం చేసేందుకు పెద్దఎత్తున బారికేడ్లను ఏర్పాటుచేసి, అటువైపుగా వెళ్లకుండా చేశారు. దీంతో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణీకులు కోర్టు చౌరస్తా వద్ద దిగేందుకు వీల్లేకుండా పోయింది. జిల్లా ప్రధానాసుపత్రితో పాటు చాలావరకు ఆసుపత్రులన్నింటికి వెళ్లాలంటే కోర్టు చౌరస్తా వద్దనే దిగాల్సి ఉంటుంది. దీంతో చేసేది లేక ఆసుపత్రులకు వెళ్లాల్సిన చాలా మంది వేరే చోట్ల దిగి వ్యయప్రయాసలకోర్చి ఆసుపత్రులకు చేరుకోవడం కనిపించింది. అసలు కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి, బహిరంగసభను ఏర్పాటుచేసుకోవడానికి స్థలమే దొరకలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులిచ్చిన అధికారులు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుండేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

