నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్:ఆసిఫాబాద్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం ఆసిఫాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగలతో కలిసి ఆమె మాట్లాడారు.గ్రామీణ పేదలు, కూలీలు, రైతుల జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త చట్టాలు పూర్తిగా ప్రజావ్యతిరేకమని విమర్శించారు. ఉపాధి హామీ చట్టం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని, అలాంటి చట్టాన్ని బలహీనపరచడం అన్యాయమని అన్నారు.వీబీజీ రామ్‌జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆత్రం సుగుణక్క ఆరోపించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు, ఉద్యమ కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకొని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

