నేటిసాక్షి, కరీంనగర్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి త్వరలో పోరుబాట పట్టనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ తెలిపారు. కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా శాఖ ప్రథమ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫిబ్రవరి 5న ఢల్లీిలో నిర్వహించనున్న మార్చ్ టు పార్లమెంటు కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టెట్, నూతన విద్యావిధానం రద్దు కోసం, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమం నిర్వహిస్తున్నట్లు దానిలో భాగంగా రాష్ట్రంలో సంఘం తరపున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5 న డిల్లీలో మార్చ్ టు పార్లమెంట్ తలపెట్టిన విషయంతో పాటు రాష్ట్రంలో పీఆర్సీ, కరువు భత్యం మరియు హెల్త్ కార్డులపై ఇతర సమస్యల మీద జాక్టో ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుందని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతి రావు మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాల నుండి సమస్యల మీద పోరాటం చేస్తున్న సంఘంలో కార్యకర్తలుగా మన బాధ్యత విస్మరించకుండా పాల్గొనాలన్నారు. ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ అరవై వేల మంది ఉపాధ్యాయుల ఉద్యోగానికి ఎసరుపెట్టే టెట్ రద్దు కోసం అందరూ కలిసి రావాలని, నూతన విద్యావిధానం అసంబద్ధ విధానాలను రద్దు చేయించుకొని నాణ్యమైన విద్య కోసం పాటుపడాలని సూచించారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సాన కిషన్, రాష్ట్ర బాధ్యులు శనిగెరపు రవి, సిద్దిపేట నుండి అతిథులుగా విచ్చేసిన రంగారావు, పట్నం భూపాల్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి సుభాష్, నాయకులు దాసరి శ్రీధర్, నారాయణ స్వామి, వెంకటరమణ, రవి, కందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

