*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )సదర్మాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కోరుట్ల ఎమ్మెల్యే డా॥ కల్వకుంట్ల సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చి, తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు.*సాగునీటి ప్రాధాన్యం:*కోరుట్ల నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి భద్రత కల్పించేందుకు గంగనాల ప్రాజెక్ట్‌లోకి ప్రత్యేక తూము ద్వారా నీరు అందించాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఈ ప్రతిపాదన అమలైతే వేములకుర్తి, ఫకీర్ కొండాపూర్, యమాపూర్, మొగిలిపేట, సంగెం శ్రీరాంపూర్, కొత్త–పాత దామ్రాజ్‌పల్లి, ఓబుళాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 8 వేల ఎకరాలకు సాగునీటి లబ్ధి చేకూరుతుందని వివరించారు. అలాగే నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.*ఇరిగేషన్ పనులకు నిధులు:*మల్లాపూర్ మండలంలోని గొర్రెపెల్లి చెరువు పునరుద్ధరణ, రేగుంట మాటూ కాలువ, మాదాపూర్ చెక్‌డ్యామ్‌తో పాటు ఇతర ఇరిగేషన్ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ పనుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని, రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని సీఎం కు వివరించారు.*ఆరోగ్య–విద్య రంగాల అభివృద్ధి:*మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, అవసరమైన వైద్య పరికరాలు అందించాలని, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో భాగంగా మెట్ పల్లి పట్టణ ప్రభుత్వ పాఠశాల భవనం, ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలని, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.*రోడ్లు–మౌలిక వసతులు:*నియోజకవర్గంలోని పలు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ముఖ్యంగా కల్లూరు బ్రిడ్జి నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలకు గతంలో మంజూరైన TUFIDC పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ని అభ్యర్థించారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే డా॥ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు._____

