నేటి సాక్షి,నల్లబెల్లి, జనవరి 18: సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు నల్లబెల్లి మండలం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సీపీఐ జిల్లా, మండల నాయకులు చింతకింది కుమారస్వామి, కడియాల క్రాంతి కుమార్, బీసీ హక్కుల సాధన సమితి మండల కన్వీనర్ చీకటి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రం నుంచి సుమారు 50 మంది కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ప్రత్యేక బస్సులో ఖమ్మం బయలుదేరారు.నల్లబెల్లి మండల రాజకీయ చరిత్రలో ఇదొక కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో సీపీఎం, ఆపై ఎంసీపీఐ (ప్రజాపంథా), పీపుల్స్ వార్ వంటి మిలిటెంట్ గ్రూపుల ప్రభావం ఉన్న ఈ ప్రాంతంలో, తొలిసారిగా సీపీఐ పార్టీ తరపున ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఖమ్మం సభకు కదలడం విశేషం. దీంతో మండలంలో సీపీఐ పార్టీకి బలమైన పునాది పడిందని (అంకురార్పణ జరిగిందని) స్థానికులు చర్చించుకుంటున్నారు.బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి తనదైన శైలిలో అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. తానొవ్వక, ఇతరుల నొప్పించక అన్న రీతిలో అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు, యువత కార్మికులతో సఖ్యతగా ఉంటూ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఈ జన సమీకరణ చేపట్టారు. సాధారణంగా అధికార పార్టీలకే జన సమీకరణ కష్టతరంగా మారుతున్న తరుణంలో.ఎటువంటి ఆర్భాటాలు, ప్రలోభాలు లేకుండా సొంత ఖర్చులతో కార్యకర్తలు కదలడం కుమారస్వామి పనితీరుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

