నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణం మరియు మండల ప్రాంతాల్లో గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని కల్లూరు రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టగా, ఇద్దరు బైక్‌లపై గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు కోరుట్ల సబ్ ఇన్‌స్పెక్టర్ చిరంజీవి తెలిపారు.*పోలీసుల తనిఖీలో బయటపడ్డ అక్రమ రవాణా*ఈ తనిఖీల సమయంలో నిందితుల వద్ద నుంచి సుమారు 100 గ్రాముల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కోరుట్ల పట్టణానికి చెందిన పసుపుల మణి సాయి (20), కండ్లె రోహిత్ (20), అలాగే కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బుయ్య దీపక్ (20), వనతడుపుల మనోహర్ (18) ఉన్నట్లు ఎస్సై వివరించారు.*పరారీలో ఉన్న ప్రధాన సరఫరాదారు..*పట్టుబడిన నలుగురు కలిసి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి, కోరుట్ల పట్టణం మరియు మండల పరిధిలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ప్రధాన సరఫరాదారుని గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.*కఠిన చర్యలు తప్పవు: ఎస్సై చిరంజీవి*గంజాయిని విక్రయించే, సరఫరా చేసే, వినియోగించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే హిస్టరీ షీట్లు తెరచి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఎస్సై చిరంజీవి హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని ఆయన సూచించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసుల నిఘా మరింత కఠినంగా కొనసాగుతుందని తెలిపారు._________

