నేటి సాక్షి – కోరుట్ల*కోరుట్ల మున్సిపాలిటీలోని 7వ వార్డుకు ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓటరు శాతాల ప్రకారం చూస్తే 7వ వార్డులో ఎస్టీ ఓటర్లు లేనట్టే ఉండగా, అదే మున్సిపాలిటీలోని 8వ, 12వ వార్డుల్లో వంద శాతం ఎస్టీ ఓటర్లు ఉన్నప్పటికీ అక్కడ రిజర్వేషన్ అమలు చేయకపోవడం న్యాయసమ్మతం కాదని బిసి వర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*7వ వార్డులో 99 శాతం బిసి ఓటర్లే*7వ వార్డులో మొత్తం 2050 మంది ఓటర్లు ఉండగా, అందులో సుమారు 1990 మంది (దాదాపు 99 శాతం) బిసి వర్గానికి చెందినవారేనని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన కేవలం 60 మంది మాత్రమే ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర వర్గాలకు చెందినవారు. ఇలాంటి పరిస్థితిలో ఎస్టీ రిజర్వేషన్ విధించడం వల్ల బిసి వర్గానికి చెందిన ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.*8వ, 12వ వార్డుల్లో వంద శాతం ఎస్టీ ఓటర్లు*మరోవైపు కోరుట్ల మున్సిపాలిటీలోని 8వ వార్డులో మొత్తం 400 మంది ఓటర్లు ఉండగా, వారందరూ ఎస్టీ వర్గానికి చెందినవారే. అదే విధంగా 12వ వార్డులో 220 మంది ఓటర్లు ఉండగా, వారంతా కూడా ఎస్టీ వర్గానికి చెందినవారే. ఈ రెండు వార్డుల్లో ఎస్టీ జనాభా పూర్తిగా ఉన్నప్పటికీ, అక్కడ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం పట్ల స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.*రిజర్వేషన్ ఉద్దేశ్యానికి విరుద్ధంగా నిర్ణయం*రిజర్వేషన్ ఉద్దేశ్యం సంబంధిత వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమేనని, అయితే ఎస్టీ ఓటర్లే లేని 7వ వార్డుకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం ఆ ఉద్దేశ్యానికి విరుద్ధమని బిసి వర్గ ప్రజలు అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల తమకు ప్రతినిధిని ఎన్నుకునే హక్కు దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.* జగిత్యాల అదనపు కలెక్టర్కు వినతి*ఈ నేపథ్యంలో 7వ, 8వ మరియు 12వ వార్డులలోని ఓటరు శాతాలను మరోసారి ఖచ్చితంగా పరిశీలించి, రిజర్వేషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని 7వ వార్డు ప్రజలు సవినయంగా కోరుతున్నారు. న్యాయసమ్మతంగా, జనాభా శాతాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.—–

