నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. జగిత్యాలలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.*ఎన్నికల ఏర్పాట్ల సమీక్ష*పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి కేటాయించిన బాధ్యతల పంపిణీ తీరును పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్, బ్యాలట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉన్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు.*సిబ్బంది వసతులు*ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాలు, వంట ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించాలని, రుచికరమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. భోజనాల అనంతరం సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామగ్రితో ఏర్పాటు చేసిన బస్సుల్లో సమయానికి చేరుకోవాలని, అధికారులు సూచించిన చోటే బస చేయాలని తెలిపారు.*సజావు పోలింగ్‌కు చర్యలు*పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు.*గణాంకాలు & పర్యవేక్షణ*జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో మొత్తం 136 వార్డులు ఉండగా 2,31,627 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 379 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5 మున్సిపాలిటీల్లో 455 మంది పోలింగ్ అధికారులు, 455 మంది సహాయ అధికారులు, 1,637 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి విధులు కేటాయించారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి, కలెక్టరేట్ నుంచి పోలింగ్ సరళిని నేరుగా పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ 96662 34383 అందుబాటులో ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.____

