నేటిసాక్షి, మిర్యాలగూడ : మున్సిపల్ ఎన్నికల లెక్కింపుకు పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లుడిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ అన్నారు. గురువారం అవంతిపురం మార్కెట్ యార్డులో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల లెక్కింపు పై మాక్ కౌంటింగ్ రిహార్సల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కౌంటింగ్ సూపర్వైజర్లు మరియు కౌంటింగ్ అసిస్టెంట్లకు కౌంటింగ్ ప్రక్రియపై వివరంగా అవగాహన కల్పించారు.ఇందులో పోస్టల్ బ్యాలెట్ కవర్లను వార్డు వారీగా వర్గీకరించడం, పోస్టల్ బ్యాలెట్ల వివరమైన లెక్కింపు, చెక్ మెమోల పరిశీలన, స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ టేబుళ్లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు, ప్రారంభ కౌంటింగ్ కేటాయింపు మరియు అంగీకారాలు (I, II & III), వివరణాత్మక కౌంటింగ్ షీట్ల తయారీ, సర్టిఫికేట్ I & II జారీ వంటి సూచనలు ఇచ్చారు. ఫలితాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ టౌన్ సి.ఐలు మరియు పోలీస్ బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

