నేటి సాక్షి గజ్వేల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుండటంతో తెలంగాణ భారత దేశ ధాన్యాగారంగా రూపుదిద్దుకుంటోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు.ప్రభుత్వ అనుమతితో హల్దీవాగు లోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అవుసులోని పల్లి శివారులోని కెనాల్ వద్ద ఇరిగేషన్ ఈఈ జితేందర్ రెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా కాపాడటమే ఈ చర్య వెనుక ఉద్దేశమని తెలిపారు.హల్దీవాగు ద్వారా నీటి ప్రవాహం కొనసాగితే దారి పొడవునా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని చెప్పారు. ముఖ్యంగా సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వడం, భరోసా నిధులు విడుదల చేయడం ద్వారా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడం, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటి చర్యలతో అన్నదాతలకు ఆర్థికంగా బలాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు తలెత్తుకుని జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ సత్యవాస్, అధికారులు మురళీధర్ రెడ్డి, ఇందిర, సాహితీ, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్త, కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కీసర వెంకటేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

