నేటి సాక్షి గజ్వేల్:—గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు నెంటూరి మల్లేశం అప్పుల బాధతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మల్లేశం కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతిని వ్యక్తం చేశారు.మల్లేశం నివాసానికి చేరుకున్న మాదాసు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లేశం తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారుడిగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఉద్యమానికి సేవలందించిన ఒక కళాకారుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆయన అన్నారు.మల్లేశం కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కళాకారులు మరియు ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గిరిపల్లి గ్రామ సర్పంచ్ పోసాని రమేష్, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, యాదగిరి, నరేష్, భాస్కర్ తదితరులు పాల్గొని మల్లేశం కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.





