నేటి సాక్షి, జగిత్యాల బ్యూరో ( రాధారపు నర్సయ్య )జనగణన కార్యక్రమాన్ని సమగ్ర ప్రణాళికతో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్ సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన 2027 తొలి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్‌కు సంబంధించి నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని అధికారులు స్పష్టంగా గుర్తుంచుకుని అమలు చేయాలని సూచించారు. గతంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వేలతో పోలిస్తే జనగణనలో సమాచారం అందించడం తప్పనిసరి అని, నిరాకరించినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.*జనగణన ప్రాముఖ్యత – సమన్వయంతో అమలు*జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది అని పేర్కొంటూ, డేటా సేకరణలో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని అన్నారు. ఎన్యుమరేటర్లు ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అందించిన మెటీరియల్‌ను పునఃపఠనం చేయాలని సూచించారు. డిజిటల్ సాఫ్ట్‌వేర్ వినియోగం, ఫీల్డ్ స్థాయి జాగ్రత్తలు, గృహాల వివరాలు, మౌలిక సదుపాయాల స్థితి వంటి అంశాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. మే 11 నుంచి జనగణన ప్రారంభం కావచ్చని తెలియజేస్తూ, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో హకీమ్ సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.______





