నేటి సాక్షి గజ్వేల్ :——-ప్రజ్ఞాపూర్‌కు చెందిన బత్తుల కరుణాకర్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. ఎల్లప్పుడూ అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుపొందిన కరుణాకర్ లేని లోటు తీరనిదిగా మిగిలిపోయిందని స్నేహితులు భావోద్వేగంతో తెలిపారు.2001–2002 విద్యా సంవత్సరంలో పదో తరగతి కలిసి చదివిన స్నేహితులు ఈ విషాద సమయంలో ఒక్కటై మానవత్వాన్ని చాటుకున్నారు. కరుణాకర్ కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో వారు కలిసి రూ.20,500 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయం ఆయన కుటుంబానికి కొంత మేర ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు.మృతునికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉండగా, కుటుంబ బాధ్యత మొత్తం ఆయన భార్యపై పడిన నేపథ్యంలో స్నేహితుల సహాయం ఎంతో తోడ్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతుని తల్లిదండ్రులు, సోదరుడు మహేందర్ పాల్గొని స్నేహితుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. “మా కుమారుడు లేని లోటును ఎవరూ తీర్చలేరు. కానీ ఇలాంటి సమయంలో అందరూ కలిసి అండగా నిలవడం మాకు ధైర్యం ఇస్తోంది” అని వారు భావోద్వేగంతో పేర్కొన్నారు.ఈ సహాయ కార్యక్రమంలో బింగి స్వామి, ధార రమేష్, కనకయ్య యాదవ్, కొలుపుల హనుమంతు, ఎండి యూనిస్, ఎండి గౌస్ పాషా, పెరక శ్రీనివాస్, కరుణాసాగర్, అక్బర్ బాషా తదితరులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ, “కరుణాకర్ మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాం” అని తెలిపారు.స్నేహితుల ఈ ఐక్యత, సహానుభూతి సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, మానవత్వం ఇంకా బతికే ఉందని మరోసారి నిరూపించింది.





