నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 04 కోసిగి ఆర్టీసీ బస్సు కిందపడి విద్యార్థి కంపాటి నరసింహులు మృతి చెందిన ఘటనపై ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.శనివారం మృతుడి నివాసానికి వెళ్లిన ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్, మహిళా కన్వీనర్ అఖిలతో పాటు నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, శ్రీనివాసులు మరియు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన నరసింహులు అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.మృతుడి కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో చదువుకుంటున్న మరో విద్యార్థికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా విద్యాసంస్థల వద్ద, టర్నింగ్ క్రాసుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రద్దీ ప్రాంతాల్లో బస్సుల వేగాన్ని నియంత్రించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే, విద్యార్థి లోకాన్ని ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు ఆకాష్, శివ, చరణ్, హరీష్, రాకేష్, తరుణ్, మల్లిఖార్జున, వినోద్, అఖిల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.





