నేటిసాక్షి, మిర్యాలగూడ :ధాన్యం దిగుమతిలో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే బిఎల్ఆర్ అన్నారు. గత రాత్రి రైతులకు, మిల్లర్లకు మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు అధికారుల జోక్యంతో మళ్లీ మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్ రాజ్ మంగళవారం మిల్లర్లతో జరిపిన అత్యవసర చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ రైస్ మిల్లర్ల తో మాట్లాడుతూ, మిల్లుల వద్ద నిలిచిపోయిన ధాన్యం ట్రాక్టర్లను వెంటనే ఖాళీ చేయించి, కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారును, మిల్లర్లను ఆదేశించచారు.రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర తప్పకుండా అందేలా చూడాలని, ధరల విషయంలో రైతులకు నష్టం కలగకూడదని స్పష్టం చేశారు.అన్నదాతలతో మిల్లర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధికారుల ఆదేశాలకు మిల్లర్లు సానుకూలంగా స్పందించి, తక్షణమే కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రకటించారు. దీంతో హైవేపై ధర్నా చేస్తున్న రైతులు తమ నిరసనను విరమించి మిల్లుల వద్దకు చేరుకున్నారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో రైస్ మిల్లుల అసోసియేషన్ నాయకులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.





