- బడ్జెట్ కేటాయింపుపై యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ తీవ్ర విమర్శలు
నేటి సాక్షి – కోరుట్ల : తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, ఇతర మైనారిటీలకు కేవలం ₹3,591 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ముస్లిం మైనారిటీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.సామాజిక న్యాయం, సమాన హక్కులు అంటూ మాట్లాడే ప్రభుత్వం మైనారిటీలను పూర్తిగా పక్కనబెట్టి, సంక్షేమ నిధులను గణనీయంగా తగ్గించడం వారి అభివృద్ధిని పూర్తిగా నిరోధించడానికి చేస్తున్న కుట్రగా మైనారిటీ నేతలు మండిపడ్డారు.
సమాన జనాభా – అసమాన బడ్జెట్!
తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాల జనాభా శాతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే, ఘోరమైన అసమానతలు కనిపిస్తున్నాయి:షెడ్యూల్డ్ కులాలు (SCs) – 15.45% జనాభా → ₹40,232 కోట్లు, షెడ్యూల్డ్ తెగలు (STs) – 9.08% జనాభా → ₹17,169 కోట్లు.ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, ఇతర మైనారిటీలు – 15% పైగా → కేవలం ₹3,591 కోట్లు ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలు కలిపి రాష్ట్ర జనాభాలో 15% పైగా ఉన్నా, వారికి కేవలం ₹3,591 కోట్లు కేటాయించడమేంటి? ఇదే బడ్జెట్ వివక్షకు ఉదాహరణ. ఇది మేము సహించబోయేది కాదు!” అని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రభుత్వం మైనారిటీలను పూర్తిగా వెనుకబాటుకు నెట్టడానికి ప్రయత్నిస్తోంది. ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలకు కనీస మౌలిక సదుపాయాలు, విద్య, ఉపాధి, ఆరోగ్య పథకాలు అందకూడదన్న కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య!” అని ముజాహిద్ మండిపడ్డారు. “తెలంగాణ ప్రభుత్వం తక్షణమే మైనారిటీ సంక్షేమ బడ్జెట్ను పునఃసమీక్షించి, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలకు తగిన న్యాయం చేయాలి. లేనిపక్షంలో, మేము రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు చేపడతాం. మైనారిటీ హక్కుల కోసం గళమెత్తే ప్రతి ఒక్కరూ ఈ అన్యాయంపై పోరాడాలి”. అని ముజాహిద్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరించారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి, మైనారిటీలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరగడం ఖాయమని మైనారిటీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.





