- అభివృద్ధి చేతకాక.. హామీల అమలు విఫలం
- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి
నేటి సాక్షి, బెజ్జంకి:
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్ర రాజకీయాలు చేస్తోందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేకపోయారని తెలిపారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023లో ఫార్ములా-ఈ రేసింగ్ కోసం హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టిందని, ఈ రేస్ నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచిందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కక్ష సాధింపుగా ఈ రేస్‌ను రద్దు చేసి, కేటీఆర్, ఇతర అధికారులపై అక్రమ కేసులు పెట్టడం రాజకీయ పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. రేసింగ్ నిర్వాహకులకు చెల్లించిన మొత్తాన్ని అవినీతి అనడం దురుద్దేశపూరితమని, ఈ చర్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో తేలుతాయని, ప్రజలు రేవంత్ రెడ్డికి తగిన శాస్తి చెబుతారని మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.