- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :26 వ తేదీన జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్ అండ్ బీ, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వేడుకల ప్రారంభం నుంచి మొదలుకొని వివిధ కార్యక్రమాలు ముగిసే వరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను తెలిపేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, స్వాతంత్ర్య సమర యోధులకు సన్మాన కార్యక్రమం, సభా ప్రాంగణంలో సరిపోను కుర్చీలను, తాగునీరు ఏర్పాటు చేయాలని, విద్యుత్ కు అంతరాయం లేకుండా చూసుకోవాలని, జనరేటర్ ను అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్ఓ వై.వి. గణేష్, డిఆర్డిఓ శ్రీను, ఆర్డీవోలు రమేష్, నారాయణ, జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




