- చెన్నూరు ఏడిఏ బానోత్ ప్రసాద్

నేటి సాక్షి, మందమర్రి:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలపై రైతులందరికీ అవగాహన ఉండాలని, విధివిధానాలు తెలుసుకోవాలని, తద్వారా పథకాల వినియోగం జరిగి లబ్ది చేకూరుతుందని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడిఏ) బానోత్ ప్రసాద్ తెలిపారు. మండలంలోని సారంగపల్లి గ్రామంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఉద్యానవన అధికారి కళ్యాణి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ అధికారి రాజేష్ లతో కలిసి హాజరైనారు. ఈ సందర్బంగా ఏడీఏ బానోత్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వంటి పథకాలపై రైతులకు వివరించారు. ఉద్యానవన అధికారి కళ్యాణి, ఆయిల్ పామ్ సాగు, సబ్సిడీ వివరాలు, సూక్ష్మ సేద్య పరికారాలపై సబ్సిడీ, పందిరి కూరగాయల సాగు, ఆయిల్ ఫాంలో అంతర పంటగా కొకోవా సాగు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటి పథకాలపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ అధికారి రాజేష్ రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన, పశు సంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పట్టు పురుగుల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అంశాలపై రైతులకు కావలసిన సమాచారం కోసం సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి వ్యవసాయ శాఖ తోడ్పడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతి కార్యదర్శి సవ్య, రైతులు కమల మనోహర్, ఫిరోజ్, రాయమల్లు, ఆసంపెల్లి రాజయ్య, ఖలీమ్, గౌస్, ముజఫర్, మహేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కారోబార్ మధు లు పాల్గొన్నారు.





