
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్, డిఐజి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టెందుకు పోలీస్ కమిషనరేట్ చేరుకున్న ఆయన ముందుగా పోలీస్ వందన స్వీకరించి, అనంతరం కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజి నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, ఐపీఎస్, పెద్దపల్లి డిసిపి పి కరుణాకర్, కమిషనరేట్ కు చెందిన పోలీస్ ఉన్నత అధికారులు, ఇతర పోలీసు అధికారులు నూతన కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాలు అందజేసి, అభినందనలు తెలిపారు. అనంతరం నూతన సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, కమీషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సత్ప్రవర్తన, మంచి నడవడిక కలిగిన వారికి, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నూతన టెక్నాలజీని నేరాల నియంత్రణకు కృషి చేస్తామని, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి రవాణా పట్ల ఉక్కుమాదం మోపుతామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ, చట్టపరిధిలో కామన్ మ్యాన్ కు న్యాయం జరిగేలా చూస్తామని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా అందుబాటులో ఉన్న డీసీపీ లతో పాటు తనను సైతం నేరుగా కలవచ్చునని, వారికి అండగా ఉంటానని తెలిపారు. 2009 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అంబర్ కిషోర్ ఝా 2011లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగా, 2012లో వరంగల్ ఓఎస్డిగా అదనపు ఎస్పీ గా పని చేయడం తోపాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం భద్రాది కొత్తగూడెం జిల్లా తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి గాను, ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీస్ లో విధులు నిర్వహించారు. అనంతరం వరంగల్ సిపి గా పనిచేసి, ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనర్ గా నియమించబడ్డారు. ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ సి రాజు, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపిఎస్, పెద్దపల్లి డిసిపి పి కరుణాకర్, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ఏసీపీ లు, ఇన్స్పెక్టర్లు, ఏఆర్ ఏసీపీ లు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



