నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): వ్యవసాయంలో కూలీల ఖర్చులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (ఎస్ఎమ్ఏఎమ్) క్రింద మహిళా రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కమల్ల మహేష్ ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్రం లోని రైతులకు ఈ పథకం వర్తింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రోత్సాహిస్తుందని ఈ మేరకు మార్చి 25 లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి యంత్రాలు, ఉపకరణాలు అందజేసే ప్రక్రియ ప్రారంభించడంతో గురువారం, శుక్రవారం మహిళా రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. సన్న చిన్నకారు రైతులకు 40%, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 50% రాయితీ లభిస్తుందన్నారు. దీంతో రైతులు తమ సొంత అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు తోటి రైతులకు కూడా తగిన రుసుంతో సేవలు అందించి లబ్ది పొందే అవకాశం ఉందన్నారు. మండల స్థాయిలో బ్యాటరీ స్ప్రేయర్స్ 04, పవర్ స్ప్రేయర్స్ 04, రోటవేటర్స్ 02, కేజీ వీల్స్ /కల్టివేటర్/ డిస్క్ హ్యారో/ ఎంబిప్లవ్ 03, డివిజన్ స్థాయిలో సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 04, బండ్ ఫార్మర్ 02, బ్రష్ కట్టర్ 01, పవర్ టిల్లర్ 01, జిల్లా స్థాయిలో ట్రాక్టర్ 03, పవర్ వీడర్ 02, స్ట్రా బేలర్ (గడ్డి కట్టలు కట్టు యంత్రం) 02, డ్రోన్స్ 01, రాయితీ యంత్రాల యూనిట్లు మంజూరై ఉన్నాయని ఆసక్తి కలిగిన మహిళా రైతులు వ్యసాయాధికారి లేదా విస్తరణ అధికారులని సంప్రదించాలని ఏవో పేర్కొన్నారు.





