Friday, March 20, 2026

రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో బిసి రిజర్వేషన్‌ల పెంపుదలకు బిసి కమిషన్‌ సిఫారసులు అనివార్యం

  • తెలంగాణ బిసి కమీషన్‌ మాజీ ఛైర్మన్‌ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

నేటి సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలలో కూడా బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లను కల్పించడానికి  అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయడానికి నిర్ణయించడం పట్ల తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రామాణిక పద్ధతులను అవలంబించకుండా తొందరపాటు చర్యలు తీసుకుంటే బిసిలకు మేలు జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రామాణిక పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఏ సంస్థలు చేయాల్సిన పనులు ఆ సంస్థలకు బాధ్యతలను అప్పగించడం న్యాయసమ్మతంగా ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వమే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆశించిన ఫలితాలు సాధ్యం కావని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు ఇప్పటికే జరిగిన సర్వేలో నమోదు కాని కుటుంబాల వారికి తిరిగి వివరాలను నమోదు చేసే అవకాశం కల్పించింది. అనంతరం సామాజిక, ఆర్థిక కులసర్వేలో సేకరించిన గణాంకాలు, సమాచారం ఆధారంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లను కల్పించడానికి వీలుగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విద్యా, ఉద్యోగ రంగాలకు గాను రాజకీయ రంగానికి గాను రిజర్వేషన్‌ల కల్పనకు రెండు వేరు వేరు బిల్లులను ఇక్కడి  చట్టసభల్లో ప్రవేశపెట్టి, ఆ సభలు ఆమోదించిన అనంతరం గవర్నర్‌ గారి సంతకంతో చట్టాలు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. కాగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్‌లకు సంబంధించిన సిఫారసుల నిమిత్తం బూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్‌ కమిషన్‌ ఇప్పటికే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్‌లను నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి రిజర్వేషన్‌లను నిర్ణయించి నివేదిక సమర్పించాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదిక విషయంలో బిసి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తొందరపడి నివేదిక ఎందుకు సమర్పించాల్సి వచ్చిందనే విమర్శలను ఎదుర్కొంటున్న విషయం గమనించదగిందే. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సామాజిక కుల సర్వే వివరాలను ఇప్పటి వరకు పూర్తిగా కులాల వారీగా అధికారికంగా ప్రకటించలేదు. డెడికేటెడ్‌ కమిషన్‌కు కూడా ఆ వివరాలు అందజేసినట్లు సమాచారం లేదు. ఇదిలా ఉండగా విద్యా, ఉద్యోగ రంగాలలో కూడా 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయించడం అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి సిద్ధమవడం శుభసూచకమే. అయితే రాజకీయ రిజర్వేషన్‌ల విషయంలో డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫారసులు ఎలాగైతే అవసరమో, విద్యా, ఉద్యోగ రంగాల రిజర్వేషన్‌ల విషయంలో కూడా బిసి కమిషన్‌ సిఫారసులు అవసరం. అందుకు గాను సమగ్రమైన అధ్యయనం, విశ్లేషణలు, సిఫారసులతో కూడిన నివేదిక అనివార్యమని ప్రభుత్వం గమనించాల్సి ఉందని వకుళాభరణం అభిప్రాయపడ్డారు. మార్చి మొదటి వారంలోనే ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవడం తొందరపాటు చర్య అవుతుంది. ఎందుచేతనంటే కులసర్వే గణాంకాలు, సమాచారమును పూర్తి స్థాయిలో డెడికేటెడ్‌ కమిషన్‌కు, బిసి కమిషన్‌కు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా అందజేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ రెండు కమిషన్‌లు నిశితంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు కమిషన్‌లు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలు అత్యంత శాస్త్రీయంగా ప్రామాణికంగా ఉండాల్సి ఉంటుంది. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల బిసి వర్గాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్‌లను 42 శాతం పెంచాలని అందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తున్నది. కాగా బిసి కమిషన్‌ నుండి సిఫారసులతో కూడిన నివేదిక తీసుకోవాలన్న ఆలోచనలె ప్రభుత్వం లేనట్టు, ప్రభుత్వ వ్యవహార సరళిని బట్టి తెలుస్తున్నది. ఇటీవల బీహార్‌ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం సామాజిక, ఆర్థిక సర్వే చేసిన అనంతరం, నేరుగా బిసి రిజర్వేషన్‌ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో బిల్లుపెట్టి చట్టం చేసింది. అయితే బిసి కమిషన్‌ సిఫారసులు లేని కారణంగా అక్కడి హైకోర్టు గౌరవ కుమార్‌ అనే కేసులో ఇచ్చిన జడ్జిమెంట్‌ అక్కడి చట్టంను కొట్టివేసింది. ప్రస్తుతం బీహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చట్టాలు చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వంను ఒప్పించి అక్కడి ఉభయ సభల ఆమోదం అనంతరం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించాలనే ప్రయత్నం చేయనున్నట్లు  ప్రకటించడం గొప్ప ఆలోచన. కాగా ప్రామాణిక పద్ధతులను పాటించకుండా, రాజకీయ ఆలోచనలతో ముందుకు వెళితే ప్రయోజన శూన్యం అని గమనించాలని వకుళాభరణం సూచించారు. ఎందుచేతనంటే కేంద్రానికి పంపించే రిజర్వేషన్‌ల పెంపు రాష్ట్ర చట్టాల వెంబడి, ఆయా కమిషన్‌లు ఇచ్చే నివేదికలు కూడా జతచేయాల్సి ఉంటుంది. ఆ నివేదికలలో రిజర్వేషన్‌ల పెంపు అనివార్యతను కమిషన్‌లు సాధికారికంగా నిరూపించాల్సి ఉంటుంది. అందుకు గణాంకాలు, సమాచారంతో కమిషన్‌లు పాటించిన ప్రమాణిక పద్ధతులలో భాగంగా తులనాత్మక అధ్యయనం, సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో నిర్దిష్టమైన వెనుకబాటుతనమును రుజువు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ‘మేము చట్టాలను చేసి మీకు పంపించాం – మీరు ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోవాల్సిందే’ అనే వాదనతో ముందుకెళితే అభాసుపాలు కాకతప్పదు. ఈ చట్టాలను, కమిషన్‌ నివేదికలను కేంద్రప్రభుత్వ సంబంధిత మంత్రిత్వశాఖ సమగ్రంగా అధ్యయనం చేస్తాయన్న విషయం ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసిద్ధ మండల్‌ కమిషన్‌ కేసు ఇంద్రాసహానీ కేసులో సుప్రీంకోర్టు 1992 లోనే 50 శాతం రిజర్వేషన్‌లు దాటడానికి వీలు లేదని తీర్పునివ్వడం జరిగింది. ఇది దాటాలన్నప్పుడు ప్రత్యేక పరిస్థితులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధికారికంగా రుజువు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా కేవలం చట్టాలను రూపొందించి 9వ షెడ్యూల్‌లో పెట్టాలని చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. అంతేగాక ఐఆర్‌ కొల్హో కేసులో రాజ్యాంగ ధర్మాసనం 9వ షెడ్యూల్‌ విషయంలో రాజ్యాంగ మౌళికతకు విఘాతం కలిగించే దిశగా ఎలాంటి చట్టాలను అయినా 9వ షెడ్యూల్‌లో చేర్చితే న్యాయ సమీక్షకు స్వీకరిస్తామని తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంగా పరిశీలించినప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందుకూడా తెలంగాణ చట్టాలు కమిషన్‌ల నివేదికలు న్యాయ సమీక్షలు ఎదుర్కొని నిలబడే విధంగా ఉండాల్సిన అవసరం అనివార్యమైనదని తెలంగాణ ప్రభుత్వం గమనించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టే ముందు రాష్ట్ర బిసి కమిషన్‌ ద్వారా సమగ్ర నివేదిక పొంది ముందుకెళ్లాలని వకుళాభరణం కోరారు. 1

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News