- పిల్లల ఆధార్ నమోదు శాతాన్ని పెంచాలి
- ఆధార్ నమోదులో తప్పుల శాతం తగ్గాలి
- జిల్లా రెవిన్యూ అధికారి మధుసూదన్ రావు
నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : జిల్లాలో ఆధార్ నమోదు శాతం పెంచేందుకు అధికారులు అందరూ సమన్వయంగా కృషి చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్ఓ అధ్యక్షతన జిల్లాస్థాయి ఆధార్ సమీకరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ స్టేట్ రీజనల్ కార్యాలయ సహాయ మేనేజర్ కే దామోదర్ జిల్లాలో ఆధార్ నమోదు ప్రగతి, 0-5 పిల్లల నమోదు, మొబైల్ బయోమెట్రిక్ యూనిట్లు, నమోదు సందర్భంగా తిరస్కరణకు గురవుతున్న అంశాలు, సాంకేతిక సమస్యలు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఆయా అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ… జిల్లాలో సచివాలయాలు, పోస్ట్ ఆఫీస్ లు, బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్ మరియు ఇతరత్రా మొత్తంగా 212 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయన్నారు. సచివాలయాలు, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులలో ఆధార్ నమోదు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సచివాలయాల్లో ఆధార్ సేవలు మెరుగు పరచాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 0-5 వయసున్న పిల్లల నమోదు లో దాదాపు 28 వేలకు పైబడి పెండింగ్ ఉన్నాయని వీటన్నింటినీ నమోదు అయ్యేలా కృషి చేయాలన్నారు. అదేవిధంగా కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. జిల్లాలో కెవిపల్లి, తంబళ్లపల్లి, వీరబల్లిలలో ఆధార్ కేంద్రాలు లేవని, అక్కడ కేంద్రాల ఏర్పాటుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. ఆధారు నమోదు సమయంలో తప్పులు లేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని ఈ మేరకు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు.



