- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్


నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక, సామాజిక ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి పర్యవేక్షకులు హరీష్ చంద్ర రెడ్డి, ఆర్ఎంఓ భీష్యలతో కలిసి ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ, సాధారణ, డయాలసిస్ వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజస్టర్లు, హాజరు పట్టికలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు కనీస సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలోని పడకలకు సరిపడా దుప్పట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రిలోని ప్రతి రోగికి దుప్పటి అందించడం జరుగుతుందని, రోగి మారినప్పుడు తప్పనిసరిగా దుప్పటి మార్చడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ఓపి సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, ఆధార్ కార్డు ఆధారిత హాజరు తీసుకోవడం జరుగుతుందని, వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు సకాలంలో పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత ఆసుపత్రి భవనం పాతది అయిందని, ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేపట్టి పనులు పురోగతిలో ఉన్నాయని, 3 నెలల్లో పనులు పూర్తి చేసి ఆసుపత్రిని నూతన భవనంలోకి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని, తద్వారా మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పర్యవేక్షించడం జరుగుతుందని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని, కనీస మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ప్రతి రోజు దాదాపు 600 మంది ప్రజలు ఓపి సేవలు పొందుతున్నారని, వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రికి ఒక పేషెంట్ తో ఒక సహాయకులు రావాలని, వైద్యులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాద పూర్వకంగా మెదలాలని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని ప్రజలతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఆహారం, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





