నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఆపరేషన్ కగార్ పేరిట అమాయక ఆదివాసీలను, విప్లవకారులను కేంద్ర ప్రభుత్వం అమా ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అరుణోదయ సంస్థ గాయకులా విమలక్క అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలో విప్లవ యూనియన్ ఎఐఎన్టీయూ మహాసభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.సింగరేణి సంస్థలో ఎఐఎన్టీయూకు ఎనలేని చరిత్ర ఉందన్నారు. కాగా, ఆదివాసీ బిడ్డలు లేకుంటే అడవులు ఉండేవికావని ఆమె స్పష్టం చేశారు. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట అమాయక ఆదివాసీ బిడ్డలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొట్టనపెట్టుకుంటున్నాయన్నారు. నిజమైన దేశభక్తులు విప్లవకారులు అన్న విషం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. అడవులను పరిరక్షిస్తున్న ఆదివాసీలను మట్టుబెట్టి బహుళజాతి కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. విప్లవకారులకు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నమాట వాస్తవమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్న విప్లవకారులకు ప్రజల మద్దతు అవసరమని ఆమె ఉ ద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం సరికాదన్నారు. అడవులు అంతరించిపోయినట్టయితే మానవ మనుగడకు ఎంతో ప్రమాదం వాటిల్లనుందన్నారు. ఎక్కడో అడవుల్లో పోరాటాలు జరిగితే మనకేందుకు అనుకోవడం సరికాదన్నారు. అడవుల సంరక్షణ కోసం ఆదివాసీలు తమ రక్తాన్ని దారపోస్తున్నారని, అలాంటి ఆదివాసీలకు ప్రజల మద్దతు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐఎఫ్ టి యు నాయకులు మాతాజీ రాయమల్లు, పల్లె లింగయ్య, సిహెచ్. జాకబ్, జనగామ చిన్నయ్య, బి.యాకయ్య,జి. కృష్ణమూర్తి, ఎస్ లావణ్య అనసూయ తదితరులు పాల్గొన్నారు.





