నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి : టీడీపీ అధినేత చంద్రబాబును దూషిస్తూ తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుట్రలిక సాగవని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఇటీవల బిఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ సమయం సందర్భం కాకున్నా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించి విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇరవై నాలుగేండ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టి, పదేండ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి, చెప్పటానికి తన దగ్గర ఏమిలేనట్లు ఇప్పటికీ చంద్రబాబు నాయుడును తెలంగాణ ద్రోహిగా చిత్రించటం భావ్యం కాదని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీకి ఓటమి ఎదురైనప్పుడల్లా, పడ్డ ప్రతిసారీ నిలదొక్కు కొనేందుకు చంద్రబాబు నాయుడును దుషించటమో, విమర్శించటమో కేసీఆర్ కు పరిపాటైందని దుయ్యబట్టారు. చంద్రబాబు పట్ల కేసీఆర్ వైఖరి వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసినప్పటికీ కేసీఆర్ కు జ్ఞానోదయం కాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. చంద్రబాబుపై, టీడీపీపై అసత్య ఆరోపణలతో బురద చల్లే కుట్రలకు, కుతంత్రాలకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో కేసీఆర్ కు, బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులుండవని హెచ్చరించారు.





