Thursday, April 2, 2026

వర్గ పోరుతో నడిగడ్డ అభివృద్ధి నాశనం

  • ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దల అసమర్థతతో కూరుకుపోతున్న నడిగడ్డ
  • రిజర్వాయర్ల నుండి రైతులకు సాగునీరు ఇవ్వని దుస్థితిలో కాంగ్రెస్ పాలన
  • విలేకరుల సమావేశంలో పాల్గొన్న
  • ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో నడిగడ్డ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా వర్గపోరుతో నడిగడ్డ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు మరియు పార్టీ పెద్దలు నాశనం చేస్తున్న దృశ్యం కనువిప్పుగా మారిందని విలేకరుల సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. నడిగడ్డ ప్రాంతంలో ఉన్న గద్వాల నియోజకవర్గ సమస్యలను అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లకుండా అభివృద్ధిని గద్వాల శాసనసభ్యులు మరియు పార్టీ పెద్దలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నడిగడ్డ రైతులు పంటలు వేసుకున్నా ఇప్పటివరకు సాగునీరు అందించకుండా రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా సమస్యను పరిష్కరించకుండా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్గ పోరుతో కొనసాగుతున్నారని మండిపడ్డారు. గతంలో అప్పటి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీకి గురవుతున్నా అట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేసి రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఇప్పటికీ అదే లీకేజీతో సాగునీరు అందించ లేనటువంటి దుస్థితిలో కొనసాగుతున్నారని తెలిపారు. 99 ప్యాకేజీ మరియు 104 ప్యాకేజీ కాంట్రాక్టర్ గా ఎమ్మెల్యే ఉన్నారని మరి అట్టి పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో జిల్లా ప్రజలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని అడగాల్సిన అవసరం ఉందని అన్నారు. గద్వాల ఎమ్మెల్యే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లయితే మీ ముఖ్యమంత్రి తో ఎందుకు ఈ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడం లేదో తెలపాలని, లేదా ప్రతిపక్షంలో ఉన్నట్లయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలని అన్నారు. గతంలో అనేక మంది రైతులు వేల ఎకరాలను కోల్పోతే,నష్టాల ఊబిలో కూర్కుపోతున్న రైతన్నలకు మేలు చేయకుండా సమస్యలను పరిష్కరించకుండా, రైతులు ఆవేదనను పట్టించుకోకుండా కేవలం మీరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు మీరే అయినప్పటికీ ఏ గ్రామానికి వెళ్లిన రోడ్లు లేని దుస్థితి నెలకొందని, నడిగడ్డలో విద్యా,వైద్యం, అభివృద్ధిపై పెడచెవిన పెడుతున్నారని, ప్రజల సమస్యలపై మీకు చిత్తశుద్ధి లేదని, నియోజకవర్గంలో అసమర్థత పాలనలో కొనసాగుతున్నారని, మీకు కేవలం అధికారం, డబ్బు, ఇసుక,మట్టి మాఫియాపై ఉన్న ధ్యాస ప్రజలపై లేదని తేల్చిచెప్పారు. గత ఐదు సంవత్సరాల నుండి ఇప్పటివరకు ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీకి గురవుతున్నా సమస్యను పరిష్కారం చేయాల్సిన నాయకులు పట్టింపు లేకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులను మరియు జిల్లా ప్రజలను నిండా ముంచుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, గట్టు,మల్దకల్ మండల అధ్యక్షులు బలరాం నాయుడు, విష్ణు, మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, మునెప్ప, నాయకులు ఉప్పరి కృష్ణ, మీసాల కిష్టన్న, గోపాల్, వెంకటేష్, ఎమునప్ప, భూపతి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News