నేటి సాక్షి, బెజ్జంకి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గద్దర్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై తన అభ్యంతరాలను స్పష్టంగా వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్‌ను హేళన చేయడాన్ని ఖండిస్తూ, బుధవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు మాట్లాడుతూ, కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ గారిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గద్దర్‌పై దేశద్రోహం కేసు పెట్టింది కాంగ్రెస్ అని, కానీ ఇప్పుడు అతన్ని సమర్థిస్తున్నట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ గారు తన పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ఆకాశంపై ఉమ్మేస్తే తిరిగి మీపైనే పడుతుందనే విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. గద్దర్ కారణంగా ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు ఎందరో అమరులయ్యారని అటువంటి వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వడం తగదని తెలిపారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఇలా చేస్తోందని విమర్శించారు. దళితులందరూ బీజేపీ పక్షాన ఉన్నారు, దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు నడుపుతోందని తెలిపారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… గద్దర్‌పై కాంగ్రెస్ ప్రేమ నిజమైనదైతే, అతని కుమార్తెకు రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు?” అని ప్రశ్నించారు.
రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు రుణాలు, ఇండ్ల నిర్మాణం చేయండని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్, మండల ఉపాధ్యక్షులు కొత్తపేట రామచంద్రం, మండల నాయకులు రాచకొండ శ్రీధర్ రావ్, శీలం వెంకటేష్, ఒగ్గు కనుకయ్య, పులి శ్రీకాంత్, కొర్వి అమర్, బోనగం నరేష్, దారం సతీష్ రెడ్డి, గంగుల ఎల్లం, అడుకని వీరేషం, రేవోజు నవీన్ తదితరులు పాల్గొన్నారు.





