బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి
నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ )
సీసీ కెమెరాల ఏర్పాటుతోనే సమాజంలో నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందని బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి వివేకానందునుకి పుష్పాంజలి ఘటించి, యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా ఉంటే గ్రామంలో 500 మంది పోలీసులు ఉన్నట్టే అని వివరించారు. ఇటీవల సీసీ కెమరాల సాయంతో ఛేదించిన కేసుల వివరాలను తెలిపారు. అంతేకాకుండా యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిస కావొద్దని చెప్పారు. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు నిత్యం ఊర్లోని యువకుల అలవాట్ల మీద దృష్టి సారించాలని, ఎవరైనా చెడు మార్గంలో పయనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయికి బానిసైన వారిని పునరావస కేంద్రాలకు తరలించి, వారిని సన్మార్గంలో నడిచేలా చేయొచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని చెప్పారు. ఇతరులకు ఓటీపీలు షేర్ చేయడం, డబ్బులు వస్తాయని నమ్మించే లింకులను క్లిక్ చేయడం వంటివాటికి దూరంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని చెప్పారు. ఇదే కార్యక్రమంలో నేరెళ్ల సర్కిల్ విద్యుత్ ఏఈ పూరెళ్ల రాజశేఖర్, జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు వడ్డేపల్లి శ్రీనివాస్, కార్యదర్శి నాయిని శైలజ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వెల్గొండ గ్రామానికి చెందిన యువత, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు ఐదు సీసీ కెమెరాలను అందించడానికి ముందుకు వచ్చారు. త్వరలో వీటిని గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు





